Yogavasista

షణ్ముఖ ముద్ర



షణ్ముఖ ముద్ర:



తూర్పు లేదా ఉత్తర దిక్కును చూస్తూ మేరుదండమును మరియు మెడను నిఠారుగా ఉంచుకొని, వజ్రాసనములో, పద్మాసనములో, లేదా సుఖాసనములో, జ్ఞానముద్ర లేదా లింగముద్ర లోగాని కూర్చుండ వలయును. కొంచెము రిలాక్స్ (Relax)అవ్వాలి.   కూటస్థములో దృష్టి నిలిపి ఖేచరీముద్రలో ఉండ వలయును..

శ్వాస లోపలి తీసికోవలయును. మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  మూలాధార, స్వాధిష్ఠాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా నెగటివ్, మరియు ఆజ్ఞా పాజిటివ్ చక్రము వరకు ఆరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి. మనస్సు మరియు దృష్టి ఆ శ్వాసను అనుసరించాలి. 



ఇప్పుడు  చెవురంధ్రములను బొటనవ్రేళ్ళ(అంగుష్ఠము)తో, నేత్రములను చూపుడు వ్రేళ్ళ(తర్జని)తో, నాసికా రంధ్రములను మధ్య వ్రేళ్ళ(మధ్యమ)తో, పయి పెదవులు ఉంగరపు వ్రేళ్ళ(అనామిక)తో, క్రింది పెదవులు చిటికిన  వ్రేళ్ళ(కనిష్ఠ)తో వెంటనే మూయ వలయును. మనస్సు మరియు దృష్టి కూటస్థములో కేంద్రీకరించవలయును. అంతః కుంభకము వీలయినంత సమయము చేయవలయును. కూటస్థములోని  అద్భుత ప్రకాశమును గమనించవలయును. దీనినే మూడవనేత్రము అందురు. బయట పసుపు రంగు(ఓంకారము) లోపల నీలము రంగు(శ్రీ కృష్ణచైతన్యము) దానిలోపల అయిదు భుజముల ప్రకాశము(పరమాత్మ చైతన్యము) కనిపించును. ఆ పరమాత్మ చైతన్యములోనికి చొచ్చుకు పోవలయును.




ఇప్పుడు శ్వాసను వదులుతూ ఆ శ్వాస మేరుదండములోని ఇడా పింగళ సూక్ష్మనాడులమధ్యనున్న సుషుమ్నా సూక్ష్మనాడి ద్వారా  ఆజ్ఞా పాజిటివ్ , ఆజ్ఞా నెగటివ్, విశుద్ధ, అనాహత, మణిపుర, స్వాధిష్ఠాన మరియు మూలాధార,  చక్రముల  ద్వారా బయటికి అవరోహణా క్రమములో  వెళ్తున్నట్లుగా భావించాలి.

ఇలా మూడు మారులు మూడు ముద్రలు వేయవలయును. ఆ తరువాత ధ్యానములో నిమగ్నమవ్వ వలయును.

Translate